Sunday, November 13, 2011

భవస్యాభ్యుధ్ధానే తవ పరిజనోక్తిః విజయతే

వ్యోమనాధుడు సాయం సంధ్యన తన కార్యాన్ని ముగించి వెడలిపోతున్నాడు. శరదృతువు లో దివాకరుడు త్వరగా విశ్రాంతి కోరాడేమో? హిమగిరి తనయ అరుణకాంతితో గల చేలాన్ని ధరించి చాలా హడావిడిగా తన తండ్రి గిరులమీద వడి వడిగా అడుగులు వేస్తోంది. హరి బ్రహ్మ ఇంద్ర ఇత్యాది దేవతలు సభ కోసం చూస్తున్నారు. శివాని మాత్రం కంగారుగా అఖిలాండకోటిని పాలించు మహేశ్వరుని కోసం చూస్తోంది. ఇంతలొ భూత గణాలు,ప్రమథ గణాల తో రానే వచ్చాడు కాల కాలుడు. అమ్మ వేగం పెంచింది. పుట్టింటి చుట్టాలు వంతపాడుతారు గదా, గిరులు ఎక్కవగా ప్రకంపించాయి. దేవతలందరూ సాష్టాంగములతో మోకరిల్లారు. వారి కిరీటాలు అమ్మ పాదాలని స్పృశించి ధన్యమయ్యాయి.

తల్లి నా తండ్రిని చేరింది. గిరిజా మనోహరుడు చిరునవ్వు నవ్వాడు. జగన్మాత తన పవిటకొంగుతో పరమేశ్వరుని ముఖాన్ని తుడిచింది.

శివదూతీ శివారాధ్యా శివమూర్తిః శివంకరీ
శివప్రియా శివపరా శిష్టేష్టా శిష్టపూజితా

జగమున చిరునగవున పరిపాలించే జనని కైలాసవాసుని చూచి మందస్మిత అయినది. సామప్రియుడు నాట్యానికి సిధ్ధమయ్యాడు.

వాగర్ధావివ సంప్రక్తౌ వాగద్ధ ప్రతిపక్తయే
జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ

Friday, August 19, 2011

ఫాలనేత్రానల ప్రబల విద్యుల్లతా కేళీ విహార లక్ష్మీనారసింహా

ఫాలనేత్రానల ప్రబల విద్యుల్లతా కేళీ విహార లక్ష్మీనారసింహా

ప్రళయమారుత ఘోర భస్త్రీకాపూత్కార లలిత నిశ్వాసడోలా రచనయా
కులశైలకుంభినీ కుముదహిత రవిగగన-చలన విధినిపుణ నిశ్చల నారసింహా

వివరఘనవదన దుర్విధహసన నిష్ఠ్యూత-లవదివ్య వరుష లాలాఘటనయా
వివిధ జంతు వ్రాతభువన మగ్నీకరణ నవనవప్రియ గుణార్ణవ నారసింహా

దారుణోజ్జ్వల ధగద్ధగిత దంష్ట్రానల వికార స్ఫులింగ సంగక్రీడయా
వైరిదానవ ఘోరవంశ భస్మీకరణ-కారణ ప్రకట వేంకట నారసింహా

ఫాలనేత్రానల ప్రబల విద్యుల్లతా కేళీ విహార లక్ష్మీనారసింహ

Saturday, August 6, 2011

నాయమాత్మా బలహీనేన లభ్యతే

అంటే బలం సంపాదించాలి.దేహ దారుఢ్యం ఉండాలి అని అభిప్రాయమా?

కానే కాదు.ధీరుడు,శూరుడు అన్న శబ్దాలను సూచిస్తూ శంకరులు ప్రశ్నోత్తర రత్నావళి లో శమ దమాలు కల వాడు, ఇంద్రియ నిగ్రహం కలవాడు అని చెప్తారు. శమము అనగా మనోనిగ్రహము, దమము అనగా ఇంద్రియనిగ్రహము అని. సాధన చతుష్ఠయం లో కూడా ఇవి కలిగిన సాధకులే మోక్షానికి అధికారి అని పేర్కన్నారు శంకరభగవత్పాదులు.

కాబట్టి మనోనిగ్రహము కలవాడే ఆత్మవిద్యకు అర్హుడు.

Tuesday, August 2, 2011

జ్ఞానాదేవ హి కైవల్యం

భగవంతుని చేరు కొనడానికి, సాక్షాత్కారానికి ఎన్ని మార్గాలు ఉన్నా ముముక్షువుకి ఉన్న ఏకైక మార్గం నివృత్తి మార్గమే.

భోధో అన్య సాధనేభ్యో హి సాక్షాత్ మోక్షైక సాధనమ్
పాకస్య వహ్నివత్ జ్ఞానం వినా మోక్షో న సిధ్ధ్యతి (ఆత్మ బోధ)


మిగిలిన సాధనల కంటే జ్ఞానమే సూటియైనది. ఎలాగయితే అగ్ని లేనిదే వంట సాద్యపడదో అలా జ్ఞానం లేనిదే మోక్షం సిధ్ధించదు.

కర్మ మాయను నిర్మూలించలేదు

నిదాఘుడు అను సదాచార సంపన్నుడు నిత్యం అన్నదానం చేస్తూ ఉంటాడు.ఒక నాడు ఋభుమహర్షి అక్కడకు వచ్చి నిదాఘుడిపైన ఆయనకు వాత్సల్యం మెండు కావడంతో, వాడికి అద్వైతాన్ని విశదంగా బోధించాడు.అయినా నిదాఘునికి సంప్రదాయానుసారమైన కర్మకాండలో మనస్సు చిక్కుకొని ఉండడం వల్ల వాటిని అనుసరిస్తూ స్వగ్రామంలో ఉండేవాడు.
ఒకసారి ఋభుమహర్షి మారువేషంలో అతని దగ్గరకు వెళ్లాడు. అప్పుడు రాజభవనం నుంచి ఉత్సవంతో బయలుదేరిన రాజును చూస్తూ నిలబడి ఉన్నాడు నిదాఘుడు. పల్లెటూరి వాని వేషంలో ఉన్న ఋభువు నిదాఘుని పక్కకు చేరి ఈ గుంపులు, కేకలు ఏమిటి నాయనా? అని అడిగాడు. ఆయన వైపు కూడా చూడకుండా రాజుగారు ఊరేగేందుకు వెడుతున్నారని నిదాఘుడు జవాబిచ్చాడు. ఎవరు రాజు? అన్నాడు పల్లెటూరి వాడు. పైన ఉన్నవాడు రాజు, కింద ఉన్నది ఏనుగు అని సమాధానమిచ్చాడు నిదాఘుడు. పైన, కింద అంటే ఏమిటో అర్థం కాలేదన్నాడు ఆ పల్లెటూరి వాడు. నిదాఘుడు కోపంతో ‘‘అయితే నీకు ఆచరణ రూపకంగానే బోధించాలి. వంగు,’’ అన్నాడు. పల్లెటూరివాడు ముందుకు వంగాడు.

నిదాఘుడు వెంటనే అతని వీపు మీదికి ఎక్కి కూర్చొని ‘‘పైన నేను రాజువలె ఉన్నాను. క్రింద నీవు ఏనుగు వలె ఉన్నావు. సరేనా. బాగా అర్థమైందా?’’ అన్నాడు. ‘‘ఊహూ... అర్థం కాలేదు. ‘నేను’, ‘నీవు’ అంటున్నావు. ‘నేను’ ఎవరు? ‘నీవు’ ఎవరు? విశదంగా చెప్పు అన్నాడు ఆ పల్లెటూరి వాడు, నిదాఘుని అంతర్ముఖునిగా చేయదలచి- నిదాఘునకు మారువేషంలో ఉన్నది తన గురువేనని తెలిసింది. గభాలున కిందికి దుమికి గురువుగారి కాళ్లపై పడ్డాడు. స్వరూప వర్ణన చేస్తూ అందులో దృఢనిశ్చయం ఏర్పడే విధంగా నిదాఘునకు ఋభుమహర్షి బోధించారు.

కర్మ మాయను నిర్మూలించలేదు ఎందుకంటే వాటకి విరోధము లేదు గనుక.విద్య మాత్రమే (ఆత్మవిద్య) అవిద్యను దీపము చీకటిని తొలగించిన విధంగా నిర్మూలించగలదు. 

అవిరోధతయా కర్మ నావిద్యాం వినివర్తయేత్
విద్యా విద్యాం నిహన్త్యేవ తేజః తిమిర సంఘవత్ (శంకర భగవత్పాద విరచిత ఆత్మ బోధ)

జ్ఞానము వలన మాత్రమే మోక్షము.

Sunday, July 31, 2011

సప్త జ్ఞాన భూమికలు

శుభేచ్చ            (శాస్త్రసజ్జనసంపర్కాభిలాష)
విచారణ            (సదాచార ప్రవృత్తి)
తనుమానస      (విషయాబిలాష క్షీణించుట)
సత్వాపత్తి          (సత్త్వ గుణాభివృధ్ధి)
అసంసక్తి            (సంగ రాహిత్యము)
పదార్ధాభావనా    (ఆత్మైక దృష్ఠి ఏర్పడుటచే బాహ్యాన్తర పదార్దములను గుర్తింపక పోవుట)
తుర్యగా              (అద్వైతాత్మ స్థితి)


                                            -  సర్వ వేదాంత సిధ్ధాంత సార సంగ్రహము

కర్తవ్యం, భక్తి, తృప్తి

పరిశుధ్ధమైన జీవితాన్ని గడుపుతూ ఆనందాన్ని పొందాలంటే మనకు మూడు మార్గాలు ఉన్నాయి

ప్రథమం మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించాలి.
తరువాత భగవంతిని పై విశ్వాసాన్ని పెంచుకోవాలి.
చివరికి మనకు ఉన్నదానితో సంతృప్తి చెందాలి.

                            - శృంగేరి జగద్గురువులు వారి జైత్రయాత్ర లో (శంకర కృప ప్రచురితం)

Thursday, June 30, 2011

దృశ్యంతే హి పురుషాః రాగాది గౌరవాత్ శాస్త్రమతిక్రమవంతః

వేదోఖిలో ధర్మమూలం. సకల భూతములు ఎటువంటి మార్గమును అనుసరిస్తే శ్రేయస్సు కలుగుతుందో ఆ విధిని నిర్దేశించేది ధర్మం.వాటికి మూలమయినవి వేదములు.ఈ వైదిక మార్గమును అనుసరింపక వారి బుద్దికి తోచిన మార్గము అవలంభిస్తూ అదే ధర్మమని చెప్పే గురువులు కలియుగములో చాలా మంది ఉన్నారు.వారి గురించే చెప్తూ శంకరులు 'దృశ్యంతే హి పురుషాః రాగాది గౌరవాత్ శాస్త్రమతిక్రమవంతః'. వారి వారి రాగ ద్వేషాలను అనిసరించి శాస్త్రాన్ని వారికి అనువుగా చెప్పుకుంటూ గతి తప్పిపోవుచున్నారు. శంకరులు వారి విషయములో బహుజాగ్రత్తగా వ్యవహరింపమని బోధించారు. సరయిన విధిని నిర్దేశించి, మానవునికి శ్రేయస్సుని కలిగించే ధర్మమును, వేదములకు నిశ్చితమయిన అర్దమును తెలువుతూ ఉండే శ్తోత్రీయబ్రహ్మనిష్ఠలు మాత్రమే సరయిన గురువులు.

మహా మునీశ్వర మంత్రం

వందే రాజస్వరూపకం త్రినయనం బాలార్కకోటిప్రభం
హస్తేపుస్తకధారిణం జపమణిః అత్యుగ్ర తేజోజ్వలం
వీణా దండధరం దేవం జటామకుట ధరం పీతాబరాలంకృతం
భక్తాభీష్ట వరప్రదం భయహరం అభయదం మహా మునీశ్వరం.


ఓం బాలార్కప్రభాయ నమః
ఓం రాజస్వరూపిణే నమః
ఓం త్రినయనాయ నమః
ఓం పుస్తక ధారిణే నమః
ఓం జపమణి హస్తాయ నమః
ఓం ఉగ్రతేజసే నమః
ఓం వీణా దండకరాయ నమః
ఓం జటామకుటాయ నమః
ఓం పీతవస్త్రాయ నమః
ఓం వరప్రదాయ నమః
ఓం భయ నివారకాయ నమః
ఓం అభయదాయ నమః
ఓం మహా శైవాయ నమః
ఓం సర్వ జన రక్షకాయ నమః
ఓం తపస్విణే నమః
ఓం మహా మునీశ్వరాయ నమః

Friday, May 20, 2011

భస్మోధ్ధూళిత విగ్రహాయ నమః

భస్మోధ్ధూళిత విగ్రహం భవ నాశనం చేస్తుందని మార్కండేయుడు స్తుతించాడు.విపరీత భయాందోళనలకు,భూతాది ప్రేతాది జ్వరములకు ప్రధమ ఔషధం విభూది.మృత్యుంజయాది మహామంత్రముల తో పరమేశ్వరుని పూజించేటప్పుడు సమర్పించేది భస్మమే.కాబట్టి ఆర్బాటము అనిపించినా మనము ధరించవలసినది,పరమేశ్వరునికి దగ్గర చేసేది భస్మమే.

భస్మ దిగ్ధ కలేబరం భవ నాశనం భవ మవ్యయం
భస్మలేపన సర్వాంగం ఏకబిల్వం శివార్పణం.

పరీక్ష్య లోకాన్ కర్మ చితాన్ బ్రాహ్మణః నిర్వేదమాయాత్

అనిత్యము,అసత్యమయిన ఈ లోకము ఏ సాధకుడినీ సమాధాన పరచదు. బ్రహ్మ జ్ఞానము ను అన్వేషించు వాడు, ఏ పరమాత్మ వలన ఈ జగత్తు ప్రతిబింబించుచున్నదో వాని కోసం పరితపిస్తాడు. అనిత్యమయిన ఈ జగత్తు నందు (జాయతే గచ్చతే ఇతి జగత్) అన్నీ వచ్చి పోయేవే అని వివేకముతో  బ్రహ్మ జ్ఞానము ను పొందిన గురువు కోసం అన్వేషణ చేస్తాడు.

Tuesday, May 3, 2011

అవ్యాజకరుణామూర్తి

నా సామర్ధ్యము శూన్యము.
భగవంతుని కృపయే కీలకము.
ఇదే వినయము.

శంకరులు షట్పదీ స్తోత్రం ఆరంభంలోనే అంటారు 'అవినయ మపనయ విష్ణో' (అవినయనము లెకుండా చేయి,స్వామీ). పరమభాగవతోత్తములు ఇది భగవంతుని పొందటానికి సులభమార్గము అని పేర్కొన్నారు.

క్షమస్వ, పాహి, త్రాహి, రక్షమాం ఇత్యాది ప్రయోగములు అనేకపర్యాయములు కవివరేణ్యులు చేసింది అందుకనే గదా!

Monday, May 2, 2011

భావయామి గోపాలబాలం మనస్సేవితం తత్పదం చింతయేయం సదా

శ్రావణ బహుళాష్ఠమి నాడు భగవంతుడు చెరసాల లో దేవకీ వసుదేవులకు లీలా మాత్రంగా జన్మించాడు.కంసుడు చెరసాల వద్ద అసంఖ్యాకమయిన రాక్షస సైనికులను ఏర్పాటు చేశాడు. భగవంతుడు ఎప్పుడయితే ఆత్మనుండి సాకార రూపంలో సృజించుకున్నాడో, రాక్షసులందరూ మాయ కమ్మి నిద్రించారు.

ఎక్కడయితే శ్రీమన్నారాయణుడు సాధకునిచే మనసున భావింపబడతాడో ఆ మనసులో కామ క్రోధమనెడి రాక్షస ప్రవృత్తులు నిద్రపోవలసినదే.

Sunday, May 1, 2011

కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళం

 ఒక ప్రశాంతమయిన చెరువులో ఉన్నట్టుండి అలజడి మొదలయ్యింది.చేపలు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశాయి. జాలరులు వస్తున్నారు, మనము తప్పించికునే మార్గం ఏమన్నా ఉన్నదా అని చర్చ జరిగింది. వయసులో పెద్దవయిన కొన్ని చేపలు అన్నాయి "వాళ్ళ కాళ్ళ దగ్గరికి వెళ్ళి వేడుకుందాము" అని. వయసులో చిన్నవయినవి అన్నాయి శత్రువు పాదాల దగ్గరికి పోవాలా అని.వాటి ఇష్ఠానిసారం చేశాయి, బుద్ది కర్మని అనుసరిస్తుంది గదా. జాలరులు లోతు ఉన్న చోట చేపలు బాగా దొరుకుతాయి అన్న లెక్కతో కొంత ముందుకి వెళ్ళారు.వేడుకుందాము అని చెరువు గట్టికు దగ్గరగా వచ్చిన చేపలు బతికాయి.

కాలం ప్రతి క్షణం కబళించడానికి దగ్గరకు వస్తుంది. మనం గనక కాలకాలుడిని ఆశ్రయిస్తే భక్తుడి కోసం కాలకూఠవిషమును సైతం అవలీలగా మింగేస్తాడు నీలకంఠుడు.

చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః

Tuesday, April 26, 2011

శ్రేయస్సు - ప్రేయస్సు

స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారికి కంచి పరమాచార్యులవారు అంటే వల్లమాలిన భక్తి. 1978లో జనతా ప్రభుత్వ పాలనా కాలంలో ఈమె లక్ష్యాలన్నీ ఘోరంగా విఫలమయ్యాయి.అప్పట్లో ఈమె స్వామివారిని దర్శించి "స్వామీజీ, నేను ఎన్నికల్లో పోటీ చేయదలచాను. గెలిచేట్లు ఆశీర్వదించండి" అని కోరారట. ఆ మాట విని స్వామి వారు సుమారు అరగంట సేపు మౌనందాల్చారట. ఎంతకూ జవాబు రాక పోయేసరికి శ్రీమతి ఇందిరాగాంధీ పునరాలోచించి "స్వామీజీ,నేను జీవితాంతం దేశానికి సేవ చేయదలచాను - ఆశీర్వదించండి"  అనగానే స్వామీజీ చిరుదరహాసంతో అభయ హస్తం చూపారట. - కామకోటి ప్రచురణ

ధర్మం,మోక్షం కూడిన అర్ధ,కామములు ఉన్నత లక్ష్యాలను చూపి శ్రేయోదాయకమయిన పురుషార్ధములుగా నిలుస్తాయి. కానిచో ప్రియమును కలిగించినా శ్రేయస్సును కలిగింపవు.

Monday, April 25, 2011

మానస భజరే గురచరణం

ఎందుకని మనసు నందు గురు చరణములను స్మరింపవలెను?

దానిని నిగ్రహించి పరమాత్మ యందు నిలుపవలెను గదా?

దాని వలన మనకు కలిగే లాభమేమిటి?

కలియుగమునందు 18 సెకనుల పాటు మనసును నిగ్రహించి పరమాత్మ యందు నిలిపిన వాడు ముక్తికి అర్హడు.(చంద్రశేఖర పరమాచార్యులు).

"చంచలం హి మనః కృష్ణ" (కృష్ణ ! మనస్సు చంచలమైనది, గాలిని చేతితో బంధించినట్లు, ఎలా నిగ్రహింపవలెను?)

"అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలమ్" (నీవు చెప్పిన మాటలలో సంశయమే లేదు)
అభ్యాసేన తు కౌన్తేయ వైరాగ్యేణ చ గృహ్యతే (కానీ అభ్యాస వైరాగ్యములతో సాధింపవచ్చును)

కృష్ణం వందే జగద్గురుం

Saturday, April 23, 2011

సర్ప సూక్తమ్

                    ఓం
               సర్ప సూక్తమ్
(నాగ దోష నివారణ,శీఘ్రముగా కళ్యాణం,సంతానం కలుగుటకు)

బ్రహ్మ లోకేషు యే సర్పాః శేషనాగ పురోగమాః
నమేస్తు తేభ్యః సర్వేభ్యః సుప్రీతాః మమ సర్వదా

ఇంద్ర లోకేషు యేసర్పాః వాసుకీ ప్రముఖాదయః
నమేస్తు తేభ్యః సర్వేభ్యః సుప్రీతాః మమ సర్వదా

కౌద్ర వేయాశ్చ యేసర్పాః మాతృభక్తి పరాయణః
నమేస్తు తేభ్యః సర్వేభ్యః సుప్రీతాః మమ సర్వదా

ఇంద్ర లోకేషు యేసర్పాః  తక్షక్షా ప్రముఖాదయః
నమేస్తు తేభ్యః సర్వేభ్యః సుప్రీతాః మమ సర్వదా

సత్య లోకేషు యేసర్పాః వాసుకి నా నురక్షితాః
నమేస్తు తేభ్యః సర్వేభ్యః సుప్రీతాః మమ సర్వదా

మలయే చైవ యేసర్పాః కర్కోటక ప్రముఖాదయః
నమేస్తు తేభ్యః సర్వేభ్యః సుప్రీతాః మమ సర్వదా

పృథివ్యాం చైవ యేసర్పః యే సాకేత నివాసినః
నమేస్తు తేభ్యః సర్వేభ్యః సుప్రీతాః మమ సర్వదా

గ్రామే యదివారణ్యే యే సర్పాః ప్రచరన్తిచ
నమేస్తు తేభ్యః సర్వేభ్యః సుప్రీతాః మమ సర్వదా

సముద్ర తీరే యే సర్పాః యే సర్పా జలవాసినః
నమేస్తు తేభ్యః సర్వేభ్యః సుప్రీతాః మమ సర్వదా

రసాతలేషు యే సర్పాః అనంతాది మహాబలాః
నమేస్తు తేభ్యః సర్వేభ్యః సుప్రీతాః మమ సర్వదా

               ఓం తత్ సత్

Friday, April 22, 2011

నేను భగవంతుడు ఒకటేనా?

వేదముల ద్వారా ప్రతిపాదింపబడిన అద్వైత సిద్దాంతమును అవైదిక సిద్దాంతములతో జ్ఞానమునకు దూరంగా పోతున్న వారిని తరింప చేయడానికి అవతరించిన అపర శంకరుడే భగవత్పాద  శంకరులు.శ్రీశంకరులు చెప్పిన అద్వైత సిద్దాంతము నందు ప్రధానంగా పరమార్ధ వస్తువు ఒకే ఒకటి అన్నారు. దానిని పరంబ్రహ్మ అని పిలుస్తున్నాము. అద్వైత సిద్దాంతములపై వచ్చిన అపవాదములను వారు సున్నితంగా పరామర్శించారు అనేక పర్యాయములు. అలాగే నిర్గుణ బ్రహ్మమును నేను అని భావించవచ్చు గాని మనము నిత్యము పూజించే భగవంతుడిని నేను అని భావింపమని ఎక్కడా తెలుపలేదు.

షట్పదీ స్తోత్రము లో
సత్యపి భేదాపగమే నాధ తవాహం న మామకీనస్త్వం
సాముద్రో హి తరంగ: క్వచన సముద్రో న తారంగ:

విష్ణో ! శుధ్ధ చైతన్యరూపంలో మన మద్య బేధము లేకపోయినా, ఈశ్వరునికి భక్తునికి మద్యగల తేడా గమనిస్తే స్వామీ నేను నీ వాడను కానీ నీవు నావాడవు అని అనకూడదు. సముద్రము తరంగమునకు వస్తుతః భేదము లేకపోయినా సముద్రము యొక్క తరంగము అని అంటాముగానీ తరంగము యొక్క సముద్రము అని అనము గదా.

తారలెంతగా మెరిసేను చందురుని కోసం...

లోకం లొ ఎన్నొ రకాల విద్యలు ఉన్నాయి.అన్నీ పరమేశ్వరుని విభూతులే. వాటిని తెలుసుకొనడంలో, వాటిలో ప్రావీణ్యత పొందడంలో ఆంతర్యం ఏమిటి? తారలెంతగా మెరిసేను చందురుని కోసం...రేయి ఎంతగా మురిసేను...దినకరుని కోసం, పరమేశ్వరుని రంజంప చేసి అనుగ్రహమును పొందటానికే. పరమేశ్వరుని విస్మరించి సాధించిన ఏ విద్య అయినా అర్ధకామములను ఇచ్చినా, ధర్మమునకు దూరంగా ఉంచి మోక్షములను ఇవ్వదు.

Thursday, April 21, 2011

సహనం సముద్రం కన్నా పెద్దది, గొప్పది.

క్షమా దానం క్షమా సత్యం క్షమా యజ్ఞః చ పుత్రికాః |
క్షమా యశః క్షమా ధర్మః క్షమాయాం విష్ఠితం జగత్ ||

ఓర్పె దానం, అన్నిటికన్నా గొప్ప కీర్తి ఓర్పె, ఓర్పుకి మించిన యజ్ఞం లేదు, ఓర్పుని మించిన సత్యం లేదు, ఓర్పుని మించిన ధర్మం లేదు, ఆ ఓర్పు వల్లనె ఈ భూమి నిలబడుతోంది.

సహనం సముద్రం కన్నా పెద్దది, గొప్పది.

Friday, April 15, 2011

తపస్సు అంటే ఏమిటి?

అరణ్యములలో సంచరించడం మాత్రం తపస్సు కాదు. ప్రాణాయామాది ఇత్యాది క్రియలు అసలే కాదు.

అమానిత్వమదంభిత్వమహింసా క్షాంతిరార్జవమ్
ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మవినిగ్రహః

లోకంలో తానే గొప్పవాడినని గర్వించే గుణం ఉండరాదు. అహింస, క్షమాగుణం,మాటలో సరళత, శ్రద్ధతో పెద్దలను పూజించుట, గౌరవించుట, స్థిరబుద్ధి, మనసు, ఇంద్రియ నిగ్రహం వంటి లక్షణాలున్నవాడే తపోనిష్ఠుడు.

పోతన భాగవతం...


అల వైకుంఠ పురంబులో నగరిలో నామూల సౌధంబు దా
పల మందార వనాంతరామృతసరః ప్రాంతేందుకాంతోపలో
త్పల పర్యంక రమావినోది యగు నాపన్న ప్రసన్నుండు వి
విహ్వల నాగేంద్రము 'పాహి పాహి' యనఁగుయ్యాలించి సంరంభియై
 
వైకుంఠలో గొప్ప మేడలో మందార వన ప్రాంతంలో అమృత సరసు ప్రక్క చంద్రకాంత మణులతో చెక్కి కలువపూలు పరచిన పాన్పుపై శ్రీలక్ష్మీదేవితో వినోదిస్తున్న శ్రీహరి గజేంద్రుని శరణుఘోష విని సంరంభంతో బయలుదేరాడు. - ఈ పద్యం గురించి ఒక కధ ప్రచారంలో ఉంది. పోతన ఒక పాదం వ్రాసి, కలం సాగక, వ్రాత కట్టిపెట్టి పొలానికి వెళ్ళాడట. తిరిగి వచ్చి చూస్తే పద్యం పూర్తి అయిఉంది. ఇదేమిటని కూతురినడిగితే మీరే వచ్చి వ్రాశారు గదా నాన్నా అన్నదట. శ్రీరామచంద్రుడే తనపట్ల కరుణించి ఆ పద్యాన్ని పూర్తి చేసి ఉంటాడని పోతన భావించాడు.

విశ్వామిత్రుడు - యాగ సంరక్షణ

అయోద్యలో దశరధుని చేత విశ్వామిత్రుని యాగ సంరక్షణార్ధం పంపబడిన శ్రీ రాముడు ప్రప్రధమముగా తాటకిని చంపాడు. యాగ సంరక్షణార్ధం విశ్వామిత్రుడు రాముడిని యాగశాల ముందు కాపలాగా నియమిస్తాడు. మిగిలిన శిష్యులతో యాగం చేస్తున్న విశ్వామిత్రుడు మాత్రం యాగం చేస్తున్నప్పుడు ప్రతి స్వాహాకారానికి ముందు ద్వారము వంక చూస్తూ తరువాత హవిస్సు సమర్పిస్తూ ఉంటాడు. శిష్యులకు మాత్రం విశ్వామిత్రుడు చేశే ఈ చర్య అర్ధం ఏమిటో బోధ పడదు. విశ్వామిత్రుడు మాత్రం యజ్ఞ భొక్త అయిన విష్ణువే ఈ యాగ సంరక్షణ చేస్తున్నాడు అని ఆయనను దర్శిస్తూ యాగమును పరిపూర్ణముగా చేశాడు.

జానకీ కాంత స్మరణం - జయజయ రామ రామ

ఆహల్య - శాప విమోచనమా - బ్రహ్మ సాక్షాత్కారమా?

ఆహల్య - శాప విమోచనమా - బ్రహ్మ సాక్షాత్కారమా?

1. ఆహల్యకు ఇంద్రునికి మద్య జరిగినది భౌతికమయిన విషయము అని నమ్మితే, ఆమే పతిని అనుగమించే స్త్రీ అవదు కదా?
2. గౌతముడు శిలగా అవ్వమని శాపము ఇచ్చాడా, అసలు ఏమని ఉంటాడు?
3. ఆమె మరి ఏమి చేసిందని మహా పతివ్రతలగా తలిచారు.
4. గౌతముడు వంటి మహాముని తో ఉంటూ ఆమెకు బ్రహ్మీ ముహూర్తములో ఆ భావన వచ్చే ప్రశ్న లేదు గదా.

ఇది భౌతికమయిన విషయము కాకుండా ఎదో నిగూడమయిన రహస్యము ఇందులో ఉండి ఉండాలి.  దోషము వచ్చినది ఇంద్రునికి సంబంధించినది. అహల్య ఇంద్రునికి సంభందించిన ఉపాసన (వైదిక మయినదే) చేస్తూ ఉండి ఉండాలి. బ్రహ్మీ ముహూర్తములో ఆయన ప్రత్యక్షము అయ్యాడు. కానీ తాత్కాలికమయిన ఇంద్ర ఉపాసన, జితేంద్రియుని చేస్తుంది. అన్నిటి కన్నా పరమోత్క్రష్ఠమయిన 'ఆత్మ విద్యను' ఇంద్ర ఉపాసన కన్నా మిన్నగా గౌతముడు  చెప్పి ఉండాలి. దాని కోసం ఆ మహా సాధ్వి సాధన చేసి చివరికి రాయి వలే అయి, చివరికి పరబ్రహ్మమునకు సాకారమయిన శ్రీ రామచంద్ర ప్రత్యక్షమయినట్టుగా సంకేతముల ద్వారా అందించారని భావన.

(ఇది ఒక పురాణ విశ్లేషకుని అభిప్రాయం)

Thursday, April 14, 2011

శంకరాచార్య - ఏక శ్లోకి

కిం జ్యోతి స్తవ భానుమానహానిమేరాత్రౌ ప్రదిపాదికం
స్యా దేవం రవిదీపదర్శన విధౌకింజ్యోతిరాఖ్యాహిమే,
చక్షు స్తస్య నిమీలనాది సమయే కింధీధియోః దర్శనే
కిం, తత్రహ మతో భవాన్ పరమకం జ్యోతిః తదస్మి ప్రభో


ఇది శంకర భగవత్పూజ్యపాదులు రచించిన ఏక శ్లోకి, ప్రశ్నోత్తరరూపంలో ఆచార్యులవారు ప్రతిజీవి లోనూ ఉన్న సనాతన ఆత్మ పదార్ధాన్ని వివరించారు.

ప్రశ్న : లోకంలో ఇన్ని వస్తువులు చూస్తున్నఅవి గదా, వస్తువు ప్రకాశమయిన జ్యోతి ఏది
సమాధానం : పగటిపూట సూర్యుడు. రాత్రి ప్రదీప చంద్రాదులు.
ప్రశ్న : మంచిది. అయితే ఈ సూర్యుడిని చంద్రుడిని నీవు దేని సహాయం తో చూస్తున్నావు?
సమాధానం : నేత్రములు.
ప్రశ్న : కన్నులు పని చేయనప్పుడు లేదా మూసినప్పుడు దేని సహాయం తో చూస్తున్నావు?
సమాధానం : బుధ్ధి
ప్రశ్న : ఈ బుధ్ధిని చూచునది ఏది?
సమాధానం : నేను. అనగా నా ఆత్మయే ద్రష్ఠ.
ప్రశ్న : అయితే జ్యోతుల కెల్లను పరంజ్యోతివి నీవే కదా?
సమాధానం : ప్రభూ! అవును.మీరూ, నేను ఆ పరంజ్యోతి స్వరూపులమే.

తత్వమసి అని బోధిస్తూ చివరికి సాధకుని ద్వారా 'అహం బ్రహ్మాస్మి'అని చెప్పించారు, శంకరులు.

శ్లో||శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం
నమామి భగవత్పాద శంకరం లోకశంకరం ||

అసంప్రదాయవిత్ సర్వశాస్త్రవిదపి మూర్ఖవత్ అపేక్షనీయః

అనగనగా ఒక అంధుడు. మరి కొంతమంది గుడ్డివాళ్ళు ఆయనను కలుస్తారు. ఆయనను అడుగుతారు స్వామీ, మేము ఒకానొక ప్రాంతానికి వెళ్ళాలి అని. స్వామి నెను తీసుకుని వెడతాను అంటాడు.వాళ్ళకి తెలియదు మన స్వామి 'గుడ్డివాడని'. ఆయనతో కలిసి పోతూ ఉంటారు. వాళ్ళు గమ్యం చేరుతారా?

ఇదే ప్రస్తుతం మన కలియుగ పరిస్ధితి. సాధనా చతుష్ఠయంతో అహం బ్రహ్మాస్మి అని తరించినవారిని గురువుగా పొందటం కష్ఠంగా ఉన్నది. జ్ఞానం ఒక్కటే కైవల్యము ఇస్తుందని తెలుసుకోకుండా, రకరకాల యోగములు మోక్షకారణాలని చెప్పే గురువులు మన గుడ్డి స్వామి లాంటివారని భగవత్పాద శంకరులు భగవద్గీత బాష్యము క్షేత్రక్షేత్రజ్ఞ విభాగ యోగము లో ఇలా అంటారు "అన్ని శాస్త్రములు తెలిసి సంప్రదాయము లేని గురువును మూర్ఖుని వలే వదిలిపెట్టండి అని".

బ్రహ్మ సత్యం జగన్మిథ్యా జీవోబ్రహ్మైవ నాపరః

Wednesday, April 13, 2011

ఈశావాశ్య ఉపనిషత్తు

ఈశావాశ్య ఉపనిషత్తు ముఖ్య ఉద్దేశ్యం అంతా "పూర్ణమదః పూర్ణమిదం..." మరియు "ఈశావాశ్య మిదం సర్వం.." అను రెండు శ్లోకాల మీద నడుస్తుంది. అదః అనగా అక్కడ, ఇదం అనగా ఇక్కడ.
 
నిరాకార నిర్గుణ పరబ్రహ్మం ఫూర్ణము, అలాగే అభిన్న వివర్త నిమిత్త ఉపాదన కారణమయిన బ్రహ్మపదార్ధము దారా వచ్చిన ఈ సృష్ఠి కూడా పూర్ణమే. ఈ పద్దతి లో బ్రహ్మము నుండి పూర్ణమియిన సృష్ఠి కలిపినా, తీసివేసినా.. పరబ్రహ్మము పూర్ణమే. ఇటువంటి సృష్ఠి(జగత్తు)అంతా ఈశ్వరుని/పరబ్రహ్మ చేత ఆవరింప బడియున్నది. అందువలన త్యాగమును అలవరచుకొని అంతట ఉన్న ఈశ్వరుడే అని ప్రవర్తించు/అనుభవించు.ఒక జ్ఞానికి ఉండవలసిన లక్షణములు తెలిపే శ్లోకం.

ఈ భావన తో కర్మయోగమును అనుసరించి ననూ, ఆ కర్మ ఫలములు అంటవు అని రెండవ శ్లోకం చెప్తూంది. ఈ ఆత్మభావనను విస్మరించు వారు ఆత్మకు అంతముందని భావిస్తూ, చీకటితో వ్యాపించిన లోకములు పోందుతారు అని మూడవ శ్లోకం వివరిస్తున్నది. నాలుగవ, అయిదవ శ్లోకములు ఆత్మ యెక్క లక్షణములు చెప్తున్నాయి.

ఆరు,ఏడవ శ్లోకములు ఆత్మానుభూతిని పొంది సర్వదా తననే చూచుకొను లక్షణములు,ఎనిమిదవ శ్లోకం మరలా ఆత్మ యొక్క లక్షణములు విశదపరచుచున్నది.

తరువాత నాలుగు శ్లోకములూ ఆవిద్యను, విద్యను వేరువేరుగా ఉపాసించు వారి ఊత్తర గతులు అలాగా రెంటినీ ఉపాసించు వారి జన్మరాహిత్యమునూ చెప్తున్నాయి. అలాగే తరువాతి నాలుగు శ్లోకములు సంభూతినీ,అసంభూతినీ వేరువేరుగా ఉపాసించు వారి ఊత్తర గతులు అలాగా రెంటినీ ఉపాసించు వారు ఎలా తీరమును దాటెదరో చెప్తున్నాయి.

చివరి మూడు శ్లోకములూ,అంత కాలమునందు ఆత్మను ఆపరోక్షానుభూతి ద్వారా తెలుసుకొనక ముక్తికోసం చేయు ప్రార్ధనను చెప్తున్నయి.
పోరపాట్లు దొర్లినచో అది నా అజ్ఞానమే.

ఓం తత్ సత్.

Tuesday, April 12, 2011

సత్యమేవ జయతే

సత్యం ఏవ జయతే న అనృతం
సత్యేన పంథా వితతో దేవ యానః |
ఏన ఆక్రమత్ ఋష్యోః ఆప్తకామా
యత్ర తత్ సత్యస్య పరమం నిధానం ||

వేదముల సారం ఉపనిషత్తులు.
పర,అపరా విద్యల గురించి చెప్తూ,పరా విద్య ప్రాముఖ్యత,
తదేతత్ సత్యం అంటూ తత్ పద నిర్దేశత్వం,ఆత్మ గురించి చెప్తూ,"బ్రహ్మ అభిన్నవ విజ్ఞానం భవ మోక్ష కారణం".
కాబట్టి ఉపాసన మార్గం ఏమిటి అంటే సత్యం,ధర్మం,ఇంద్రియ నిగ్తహం అని వివరిస్తూ..సత్యమేవ జయతే,తద్వారా అంతః కరణ శుద్ధి, అప్పడు గురువు చెప్పే "తత్త్వం అసి" మోక్షమార్గమునకు తొలి/మలి మెట్టుగా చెప్పే ముండకోపనిషత్తు లో సత్యవాక్పాలన గురించి చెప్పే శ్లోకం ఇది.

రామా..నీ వాడ సుమీ

సకృదేవ ప్రసన్నాయ తవాస్మీతి చయాచతే
అభయం సర్వభూతేభ్యుః దదాన్యేత దృతంమమ

శ్రీమద్రామాయణం లో మర్యాదా పురుషోత్తముడు శ్రీ రాముడు విభీషణుడు శరణు అన్నప్పటి సందర్భంలో చెప్పిన శ్లోకం ఇది. శత్రవు సోదరుని చేరదీస్తే ప్రమాదమని ఎంతమంది చెప్పినా 'ఒక సారి నన్ను శరణు అని ఎవరు వేడినా వారికి అభయం ఇస్తాను. రావణుడయినా సరే' అంటాడు. ఈ సందర్బంలో సాదకుడు శ్రీరామచంద్రుని అడగవలసినది 'పాహిమాం' అని, రాముడు 'భవ జలది మధన మంధర' అని భగవత్పాదులు చెప్పినట్టు, భవసాగరాన్ని దాటిస్తాడు.

"నారాయణ కరుణామయ శరణం కరవాణి తావకౌ చరణౌ"

Monday, April 11, 2011

పురాణ అంతర్గత విషయము - ప్రారబ్ధము అనుభవింపవలసినదేనా

శిష్యుడు : గురువు గారు ప్రారబ్ధము అనుభవింపవలసినదేనా? దానిని అధికమించడానికి ఏమన్నా మార్గము ఉన్నదా?

గురువు గారు :అనుభవింపవలసినదే, కానీ మార్కండేయుని చరిత్ర చూస్తే దాన్ని తపస్సు ద్వారా ఎదుర్కొనవచ్చును అని తెలుస్తుంది. ప్రారబ్ధము మరియు తపస్సు రెండూ రెండు పోట్ల గిత్తలు లాంటివి. వాటి యందు ఏది బలమయినదో చెప్పటం చాలా కష్ఠం. విషయవాసన లో కొట్టుమిట్టాడుతున్న వానికి ప్రారబ్ధము అనేది బలంగాను, తపస్సు ఆచరణలో ఉన్నవానికి భగవదనుగ్రహము బలంగాను ఉంటాయి. బలాన్ని బట్టీ జయముకలుగుతుంది. అందువలన ప్రారబ్ధమును తప్పకుండా జయింవవచ్చును. మార్కండేయడు అల్ప ఆయుస్సు గల వాడు. కానీ ప్రాణ ఉత్-క్రమణ సమయములో శివుని స్మరించాడు. తపస్సు ఆచరణలో ఉన్నవానిని రక్షించడానికి భగవంతుడు దేవతలతో కూడా పోరాడటానికి సంశయించడు. మార్కండేయునిరక్షించడానికి మహాదేవుడు కాలుడిని నిలువరించెను గదా.

మహాదేవ మహాదేవ మహాదేవ దయానిధే
భవానేక భవానేక భవానేక గతిర్మమ

యజ్ఞ వరాహ మూర్తి వర్ణన

భూమి ఉద్ధరించిన యజ్ఞ వరాహ మూర్తి వర్ణన జరిగింది. అతడి నాలుగు పాదములు నాలుగు వేదములు, కోరలు ఊపష్తంభములు, నాలుగు ముఖములు బ్రహ్మ నాలుగు శీస్సులు, నాలుక అగ్నిదేవుడు,నేత్రములు రాత్రి పగలు, రోమములు ధర్భలు, ఆజ్యము ముక్కు, తోడము స్రువం,ధ్వని సామ ఘోష, స్వేదం సత్య తేజస్సు, కర్మ విక్రమము, లింగము హోమము, ఫలబీజములు ఓషధులు, అంతరాత్మ వాయువులు,స్థులు మంత్రములు, రక్తం సోమము, మూపులు వేదములు, హవిస్సు గంధం, ఇష్టి ఆయన తళుకులు ఇలా ఆయన శరీరం యజ్ఞా దీక్షా సహితంగా వర్ణించ బడింది