Friday, June 7, 2013

దయా సర్వభూతేషు (ఆత్మ గుణములు)



మనిషికి ఉండవలసిన ప్రాధమిక గుణం దయ.
గౌతమ ధర్మ సూత్రములలో మొట్ట మొదటగా చెప్పిన గుణం దయ.

దయా సర్వ భూతేషు క్షాంతి రనసూయా
శౌచ మనాయసో మంగళ మకార్పణ్య మస్పృహేతి

దయ అంటే 'పరదుఃఖ ప్రహణేచ్చ' అని శాస్త్రం చెపుతున్నది (पर दुख प्रहाणेच्च). అంటే పక్క వాడి దుఃఖము తొలగిపోవాలని మనసులో కోరుకొనడం.



ఆత్మగుణములు

ఆత్మగుణములు

దయ : సర్వభూతములందు దయ తప్పనిసరి. శత్రువునయిననూ విపత్తునందు రక్షించడము.
అనసూయ : గుణవంతుల గుణాదులు బయటకు వెల్లడించడము. అనగా అసూయ లేకుండుట అని అర్ధము.
అకార్పణ్యం : సత్పాత్రునకు లోభము చూపక తన శక్తి కొలది భక్తితో దానము ఇచ్చుట.
అస్పృహ : ఇతరుల వస్తువులను అపేక్షించకపోవడము.
అనాయాసం : క్షుద్రకర్మలు, శరీర పిడలు కలుగు నటువంటివి ఆచరించ కుండా ఉండటము.
మాంగల్యం: మంగళ ప్రదమగు పనులు అనగా ప్రశస్తమగు నటువంటివి.
శౌచం : స్వధర్మమును ఆచరించుట అని అర్ధము.
క్షాంతి : ఇతరులు ఎవరైననూ తనకు బాధ, దుఃఖము కలిగించిననూ కోపము తెచ్చుకొనక ఓర్పుతో ఉండటము.

ఈ ఎనిమిది ఆత్మగుణసంస్కారముల వలన చిత్తశుద్ది కలుగును.

Tuesday, July 17, 2012

మహా ప్రస్థానం

మొక్ష-ఇచ్చ మానవుడి కీలక లక్ష్యము.

దానిని ఎలా సాధించాలి?

దైవ నామ స్మరణ ఒక్కటే సులభ మార్గం.

మరి ఎంత కాలం చేయమంటారు ఈ దైవ నామ స్మరణ, కష్టం కదా?

జీవించినంత వరకు.

అదేదో పోయేటప్పుడు చేస్తే సరిపోతుంది గదా. ఇప్పటి నుండి ఎందుకు?

పోయేటప్పుడు చేయాలంటే ఇప్పటినుండి అలవాటు చేసుకోవాలి.

अन्तकाले च मामेव स्मरन्मुक्त्वा कलेवरम् ।
यः प्रयाति स मद्भावं याति नास्त्यत्र संशयः ॥

అంత్య కాలములో ఎవరు నన్ను స్మరిస్తూ శరీరాన్ని వదిలి పెడతారో, వారు నన్నే చేరతారు అనడానికి సంశయము లేదు.(భగవద్గీత)

Thursday, July 12, 2012

లక్ష్య సాధన

పశ్చిమ కనుమలలో పడిన ఆకాశ గంగ మార్గాలను వెతుక్కుంటూ ఎన్నో పర్వతాలు, వృక్షాలు, రాళ్ళూ దాటుకుంటూ పోతుంది. దాని లక్ష్యం ఒక్కటే, సముద్రం లో చేరడం. ఈశ్వర నియతి ప్రకారం సంచరిస్తూ, మానవ జీవనావాలి కోసం ఉపయోగ పడుతూ చివరికి నిర్దేశించబడిన లక్ష్యాన్ని చేరడమే. పశ్చిమ కనుమలలో పడిన గంగ అరబిక్ కడలి లోను కలవ వచ్చును, కానీ ఈశ్వరుడు నిర్దేశించిన మార్గం వేరు. తూర్పుకు పోమ్మన్నాడు. నేను మంచి సుగంధభరిత వృక్షాలతో మాత్రమె కలిసి పోతాను అంటే కుదరదు, అందరినీ సమానం గా చూడాల్సిందే అని. కొంత మంది ఈ గంగను పవిత్ర కార్యాలకు ఉపయోగిస్తారు. మరి కొంత మంది శరీర శుద్ది కోసం వాడుతారు. అపవిత్రం చేసేవారి సంగతి వేరే చెప్పనవసరం లేదు గదా. నిర్దేశించిన వాడు చెప్పాడు, పురుషోత్తములు నీ ప్రవాహములో మునుగుతారు, నీకు మరలా పవిత్రత చేకూరుతుంది అని. పెద్ద, చిన్న అందరినీ ఒకే దృష్టి తో చూస్తూ గెంతుకుంటూ, తప్పుకుంటూ ఒకేరకం గా వెళ్ళిపోతుంది గంగ. చివరికి సాగరం లో కలిసి తన రూపాన్నీ నామాన్నీ కోల్పోయి (అస్తిత్వాన్ని కూడా) పరిపూర్ణత్వాన్నిపొందుతుంది.

మనము కూడా చేయవలసినది అంతే. లక్ష్యం పరిపూర్ణత్వం. మనసు చెప్తుంది, వీడు మంచివాడు, వీడు చెడ్డవాడు. నాకు ఇది ఇష్టం, ఇది కష్టం అని. గంగ ని చూసి నేర్చుకోవాలి. ఇష్టం ఉంటె చెప్పనవసరం లేదు, కష్టమైతే నే అంతర్మధనం.  ఒక కెరటం పెద్ద కొండకి ధీ కొడుతుంది, కష్టం అని తప్పుకు పోతుంది. లక్ష్యం కలబాడటం కాదు, మార్గం సుగమం చేసుకోవడం. కష్టం కాబట్టి తప్పుకు పోతుంది. మనసు కి చెప్పు... వాడితో కష్టమా..చెప్పి చూడు..మారడా సరే. లేదంటే నువ్వే మారు.. తప్పుకు వెళ్ళిపో. ఇది ఓటమి కాదు. కానీ వెనక్కి మాత్రం వెళ్ళకు. లక్ష్యానికి చేరువ కావడమే. లేదు, కాదు నా వల్లే అవదు అంటావా.. అంతర్మధనం తప్పదు, క్షొబ తప్పదు, రాగా ద్వేషములు  తప్పవు. నాకు అవసరమే లేదు అంటావా, నీ మార్గం వెనక్కి పోవలసి వస్తుంది. అసలు వాడిని కలవాల్సిన అవసరమే నాకు లేదు గదా అంటావా, ఆ గతి ని ప్రారబ్దం నిర్ణయిస్తుంది, నీవు కానే కాదు. అంతర్మధనం. చెందే మనస్సు సాధన కి పనికి రాదు.

నేను నా పనిని నమ్ముకున్నాను, ఎవడినీ కాదు, అని అంటావా, "కర్మాణి ఎవ అధికారహ, మా ఫలేషు", ధర్మ విహితమైన పని చేయడం లోనే నీకు అధికారం ఉన్నది. ఫలమునందు కాదని భావన. కర్మ ఫలం ఊహించడం చాల కష్టం. ఇవాళ ఫలితం బాగుండవచ్చు, రేపటి సంగతి చెప్పలేము. అది ఇచ్చేవాడు ఈశ్వరుడు. దైవం ధర్మ రూపం లో ఉన్నది (ధర్మ విహితమైన కర్మ ని  మాత్రమే మనము ఆచరించాలి, అదే జ్ఞానమును ఇచ్చేది). కర్మ జడమైనది. ఈ కర్మ మీద మమకారం తో అహంకారం తెచ్చుకుంటే కష్టమే. కర్మ ఫల ప్రదాత మాత్రం జడమైనది కాదు. వాడి అనుగ్రహం తోనే లక్ష్యాన్ని సాధించగలం.

Wednesday, July 11, 2012

పురుషార్ధ నిశ్చయము

ధర్మ అర్ధ కామ మోక్షములు చతుర్విధ పురుషార్ధములు. ఐతే వీటిలో మానవుడు వేటిని ఆశ్రయించాలి అనేది ప్రశ్న. కర్మ మార్గమును అవలంభిస్తున్న సాధకుడు ధర్మ మోక్షములు మూలముగా చేసుకుని అర్ధ కామములు నిర్దేశించుకొనవలేను. హిరణ్య కశిపుడు ఆచరించిన ఘోర తపస్సు పురుషార్ధ నిశ్చయము లేకుండగా సాగింది. తపస్సు ను (ఫలితము) అంతః కరణ శుద్ది, మోక్షము నకు కాకుండా ఇతర లౌకిక విషయ సిద్ది కోసం వెచ్చించాడు. ఆ ఫలములన్నీ కాలగర్ధం లో కలిసి పోయాయి.

అన్తవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసామ్|
దేవాన్దేవయజో యాన్తి మద్భక్తా యాన్తి మామపి|| 7-23 ||

అల్ప బుద్ధులైన వారికి లభించే ఫలం నశించి పోయేదిగా ఉంటుంది.దేవతలను ఆరాధించేవారు దేవతలను చేరుతారు,నన్ను ఆరాధించేవారు నన్ను చేరుతారు. (ఇక్కడ సిద్డులను ప్రసాదించే దేవతలు అని గ్రహించడం ఉత్తమము, అంతే గానీ కృష్ణుడు, హరి, రాముడు అని వేరు వేరు గా గ్రహించడం అధమము)

భక్త ధ్రువుడు లౌకిక విషయ సిద్ది (తండ్రి ఒడి లో కూర్చోడానికి స్థానం లేదని తెలిసి తల్లి ద్వార నిర్దేశించబడి వనములందు సంచరిస్తూ శుద్ధ-సాత్విక మార్గములో తపస్సు ఆచరించాడు) కోసం తపస్సు మొదలు పెట్టినా శ్రీహరి సాక్షాత్కారం తరువాత నాకు నువ్వు తప్ప ఇంకేమీ వద్దు అని నిశ్చయించాడు.

భగవత్పాద శంకరులు నిర్దేశించిన మార్గం ప్రకారం మనము ఏట్టి పరిస్తితులలోను లౌకిక విషయ సిద్ది కోసం సాధన చేయకూడదు. అంతః కరణ శుద్ది ప్రసాదించమని ఈశ్వరుని ప్రార్ధించాలి. ఈశ్వరానుగ్రహము గురువు రూపం లో వచ్చి మోక్షమార్గామునకు దారి చూపుతుంది.

Tuesday, June 26, 2012

పుణ్య పాపాలు


"సుఖస్య దుఖస్య నకోపి దాతా
పరో దాదాతీతి కుబుద్ది
రేష"

మనం అనుభవించే సుఖ దుఖాలకు కారణం ఎవరో అని భావించేవాడు మూర్ఖుడు. వాటికి కారణం మన పూర్వ పుణ్య పాపాలు

అయితే

“పుణ్యస్య ఫలమిచ్చంతి పుణ్యం నేచ్చంతి మానవాః

న పాప ఫలమిచ్చంతి పాపం కుర్వంతి యత్నతః”

సహజంగా మానవులు పుణ్యం చేయరు కాని, పుణ్య ఫలాన్ని కోరుకొంటారు.కావాలని పాపం చేస్తారు. కాని పాప ఫలం కోరుకోరు.

Friday, June 22, 2012

మోక్షసాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి

మార్గావర్తిత పాదుకా పశుపతేరఙ్గస్య కూర్చాయతే
గణ్డూషాంబు నిషేచనం పురరిపోర్దివ్యాభిషేకాయతే
కించిద్భక్షిత మాంసశేషకబలం నవ్యోపహారాయతే
భక్తిః కిం న కరోత్యహో వనచరో భక్తావతంసాయతే

ఆహాహా ! ఏమి శివభక్తి మహిమ ! చిరకాలము దారిని నడిచిన పాత కాలిచెప్పు,ఆ  కాళహస్తీశ్వరునకు కనుబొమల నడుమ చోటు నేర్పరచుకున్నది. పుక్కిలించి ఉమ్మిసిన  నీరు ఆ త్రిపురారికి గంగా జలభిషేకమయ్యెను. సగము కొరికి తినగా మిగిలిన  మాంసపు ముక్క ఆ జగదీశ్వరునకు మహానివేదన ద్రవ్యమయ్యెను.అడవులయందు దిరుగు కిరాతకుడు { కన్నప్ప } భక్తాగ్రగణ్యుడయ్యెను. భక్తి ఏమి చేయదు.?